Sunday, September 29, 2013

జాలి



ఫణీంద్ర//జాలి//15.09.2013

కొక్కొరో కో అంటూ...
మేల్కొల్పు పాటలందుకున్నాయి కోడిపుంజులు!
పల్లె నిద్ర లేచింది,గడియారం గంట విన్నట్టుగా!!
ఎంత ఖచ్చితమైన లెక్కో!

కుహు.. కుహూ.. మంటూ..
కొమ్మల్లో కోయిలమ్మ రాగాలు తీస్తూ చెబుతోంది!
వసంతం వచ్చేసిందని!
ఋతువుల్ని అవధానం చేసే మేధావి మరి!
ఎంత మేధస్సో!

కావ్ కావ్ మనే కాకమ్మలు..
ముక్కున ముళ్ళకంచె ముక్కలు ఏరుకొని
కొమ్మల మాటున గూటిని అల్లి
రెల్లుగడ్డి పరకలను పరుపుగా పరుస్తున్నాయి
తమ ప్రేమ ఫలాలని పొదగటం కోసం!
ఎంత ముందుచూపో!

ఎర్ర నల్లని యూనిఫారాలు వేసుకున్న సైనికులు..
క్రమం తప్పకుండా కవాతు చేస్తున్నాయి!
మనం చెదరగొట్టనంతవరకూ..అలా..
ఒకదాని వెంట మరొకటి..నడుస్తూనే వుంటాయి
ఎర్రచీమలు..నల్ల చేమలు!
ఎంత క్రంశిక్షణో!

ఎక్కడో ఆకాశంలో చిన్న ఆకారం..
అంత ఎత్తునుంచే నిఘానేత్రం!
ఒక్కసారిగా,క్షిపణి వేగంతో నేలతాకటం,
సందులొని కోడిపిల్లని కాళ్ళతో తన్నుకుపోవడం,
రెప్పపాటులో పూర్తిచేస్తాయి డేగలు!
ఎంతటి నిశతదృష్టి!ఎంత చక్కని గురి!

గోధూళి వేళ..
పిట్టలన్నీ గూళ్ళకు చేరుకుంటున్నాయి,
పగలంతా పడిన శ్రమకు రాత్రిలో సేదతీరటానికి!
శ్రమకు,విశ్రాంతికి మధ్య ఎంత చక్కని సమ్యమనం!

మూగజీవులని అనాయాచితమైన జాలిచూపుతాం,
మాటలు మాత్రం ఒచ్చిన మనుషులమంతా!
కానీ...
అలాంటి జాలే అవి మనపై చూపిస్తే?
మనదగ్గర సమాధానం వుందా?

.... 15.09.2013

Saturday, September 28, 2013

వెదుకుతున్నా

ఫణీంద్ర//వెదుకుతున్నా..//26.09.2013

మళ్ళీ తెల్లవారింది..
అలవాటుగా చుట్టూ తడిమాను!
యాసగా ఉన్న పక్కలో..
పాప బోసినవ్వులకోసం,
పెట్టే కేరింతలకోసం,
అంతలోనే ఏడ్చేస్తూ చేసే అల్లరికోసం!
వెదుకుతున్నా..
అయినా..

హాలులో..
ఒంటరైపోయిన ఉయ్యాల హుక్కు,
హుక్కుకి వ్రేలాడే ఉయ్యలలో పాప కోసం...
తలంటుతోంటే పెట్టే గుక్కకోసం,
సాంబ్రాణి పోగకి మూసే మగత కళ్ళకోసం,
జోల పాటకి హాయిగా నిదురోయే చిట్టితల్లి కోసం!
వెదుకుతూనే వున్నా..
అయినా..

వంటింటి అల్మారా లో
బొసిపోయిన ఖాళీ పాల డబ్బాలు!
కాఫీ త్రాగాలనిపించటం లేదు

ఒక్క క్షణం కూడా నిలువనివ్వని
ఆకలి అరుపులకోసం..
ఇల్లు వాడ దద్దరిల్లే పాప ఏడ్పులకోసం..
కూతురి కడుపునింపటానికి
నాకుతురు తీసే పరుగుల కోసం!
వెదుకుతూనే వున్నా..
అయినా..

వరండాలో..
నడుంవాలుస్తూ పైకి చూశా..
వెలిసిపోయిన ముఖంతో,
బిక్కు బిక్కుమంటూ
నన్నే చూస్తోంది,బట్టలారేసుకొనే తాడు!

తాడంతా వ్రేలాడే చిట్టిఫొట్టి గౌనులకోసం..
వరసగా రెపరెపలాడే చిన్ని చిన్ని నేపీలకోసం..
ముచ్చటేసే ఆరేసిన పాప బట్టలకోసం!

అయినా..వెదుకుతూనే వున్నా..
బోసిపోయిన ఇంట్లో..
నిద్ర రాని..కలత నిద్రలో..
అమ్మతో కలసి..నాన్న దగ్గరకు తుర్రుమన్న,
నా చిట్టితల్లి కోసం...

....26.09.2013

Monday, September 2, 2013

అమ్మ పలుకులు



ఫణీంద్ర//అమ్మ పలుకులు//25.07.2013

అర్ధరాత్రి..
మత్తుగా నిదురోయేనాకు,
కేర్ కేర్ మనే నీ ఏడ్పులు,
మధుర సంగీతంలా వినిపించేవి!
నా నిద్దరని నీకరువిచ్చి,
అలసిన కళ్ళతో నిను చూస్తూ మురిసేదాన్ని కన్నా!

గుండెలని తన్నే
నీ చిన్నారి పాదాలు,
నా హృదయాన్ని గిలిగింతలు పెట్టేవి!
నువ్వు తన్నినా,రక్కినా,
భరించటంలోనే ఆనందం!
నీ కేరింతలే నా మదిలో,పులకింతలయ్యేవి కన్నా!

వేళకాని వేళ,
రాకాసి కధలు చెప్పమంటూ మారాం చేస్తే,
అన్ని పనులు ఆపుకొని,
నిన్ను "" కొట్టించడంలోనే నా ఆనందం!
కధ వింటూ కనులు వాల్చేవరకూ,
నా సహనాన్ని నేనే పరీక్షించుకొనేదాన్ని కన్నా!

ఉదయం..
కాలు నిలవనివ్వని హడావిడి,
ముచ్చెమటలు పట్టిస్తుంటే,
స్కూలుకి నిను తయారుచేయటం
నాకో మహా యజ్ణం!
అయినా..స్కూలు బస్సెక్కి
అల్లరిగా నవ్వుతూ చేయూపే
నిన్ను చూస్తే,
అలసటంతా మటు మాయమయ్యేది కన్నా!

చదువుల తల్లి ఒడిలో
చూస్తుండగనే ఎదిగిపోయి,
ఉన్నతశిఖరాల్ని అందిపుచ్చుకున్న
నిన్ను చూస్తే,
ఎంత ఆనందం!ఎంత గర్వం!!
హృదయం ఉప్పొంగి
హిమాలయాలంత ఎత్తుకి ఎగిరితే,
మనసు మంచులా కరిగి
సూన్యమైంది నువ్వు దురమౌతున్నావని కన్నా!

బుగ్గచుక్కలో ఎంత అందంగావున్నవురా కన్నా!
ఇక కుందనపు బొమ్మ చేతిలో నిను పెడుతున్నా
మరి ఆమెలో అమ్మని కూడా చూసుకో గలవా కన్నా....

                     ఫణీంద్ర//25.07.2013






Sunday, September 1, 2013

హైకుహారం-1


ఫణీంద్ర// హైకుహారం-1//22.07.2013

1.
తళుక్కున మెరుపు
ముత్యాలు రాలుస్తూ..
ఆకాశం!

2.
చలికి ఒణుకుతూ ఊరు
తెల్లదుప్పటి కప్పుకుంది
పొగ మంచు!

3.
పెళ్ళి శోభ
శృతి పెంచిన సన్నాయి
కళ్ళలో కళ్ళు!

4.
చీకటి రాత్రి
వెన్నెలయ్యింది నా మది
నువ్వు వచ్చావుగా!

5.
జోరున వర్షం
ప్రకృతిని తలంటుతూ..
ఫ్రెష్ గా గాంధి తాతయ్య!

6.
ప్రాణం తీసే బాణం
దూది పింజయ్యింది
చెలి క్రీగంటి చూపు!

7.
పెదవులపై ఆత్రం
ఎంగిలికాదా మరి?
అధరామృతం!

8.
సృస్టి లో మరో
మొగ్గ పువ్వయ్యే వేళ..
పురిటి నొప్పులు!

9.
అర్ధరాత్రి నిశ్శబ్ధం
అరుపులే పూలజల్లులయ్యాయి
పాపాయి ఏడ్పులు!

10.
విరబూసిన పువ్వులు
అత్తరు పూసుకుంటూ..
చిరుగాలి!
Phanimdra..22.07.2013