ఫణీంద్ర//మనోవేదన//17.08.2013
నాకు రాత్రంటే ఇష్టం..చీకటి రాత్రంటే మరీను!
ఇష్టమని కాదు..అలసిన మనసు అవసరం!
అందుకే..సూర్యుణ్ణి ప్రార్ధిస్తా ..
పరుగల వేగం పెంచి,పశ్చిమాన ఒదిగి పొమ్మని
చంద్రుణ్ణి ప్రార్ధిస్తా..
ఎప్పుడూ ఒంటికి నల్లరంగేసుకోమని
చీకటైన బ్రతుకు, చీకట్లోనే సేదతీరుతుందనే ఆశ!
నాకు ఉదయం అంటే భయం!
ఉషఃకిరణాల తళుక్కులంటే మరీను!
నిశి కౌగిలిలో సేదతీరిన హృదయం,
భళ్ళున తెల్లారేసరికి,భయంతో ఒణుకుతుంది
సూన్యంలో స్నానమాడాలని!
గాజుల గల గల లుగా వినిపిస్తే, ఇల్లంతా వెదికా
ప్చ్!అవి నిశ్శబ్దంగా,ఆగాజుల పెట్టెలో నిద్దురోతున్నాయి
మువ్వల సవ్వడులనిపించి,పరుగులు తీసా
ఉహు!మూగవోయి,మట్టిపట్టి,మంచమ్మీదే పడివున్నాయి
రంగురంగుల పట్టుచీరల్లో నీ సింగారం చూడ పరితపించా
ఉహు!వెలసిన చీరలు చిరుగుల దశకి చేరుకు న్నాయి
వీణమీటిన నీ వ్రేళ్లని అందుకోవాలని ఆత్రపడ్డా
కానీ,తీగలు తెగి, బూజుపట్టిన వీణ ఓ మూలకేపరిమితమైంది
నాకు తెలుసు,చిరుగాలి తెచ్చిన పరిమళం నీదేనని
కానీ,చిరుగాలికేంపోయింది? చిన్నగా పలకరించి వెళ్ళిపోయింది
మురిపించి,మరపించి,నీకౌగిటకి పిలుస్తావనే చిన్ని ఆశ!
కానీ,నీ పిలుపు మౌనమయ్యింది!
గుండెల్ని పిండిచేసే బాధతో కళ్ళుమూసుకున్నా ఎంతోసేపు
కళ్ళుతెరిసి చుస్తే ఏముంది?
ఎదురుగా నువ్వు!
దండలోంచి తొంగిచూస్తూ,చిరునవ్వులు చిందిస్తున్నావ్!
మరినువ్వు,ఇలా ఫొటోలో కాకుండా,
నిజంగానే నాముందుంటే..
ముచ్చటైన మరెన్ని మంచి కవితలు అల్లేవాడినో....
......17.08.2013
No comments:
Post a Comment