Saturday, September 28, 2013

వెదుకుతున్నా

ఫణీంద్ర//వెదుకుతున్నా..//26.09.2013

మళ్ళీ తెల్లవారింది..
అలవాటుగా చుట్టూ తడిమాను!
యాసగా ఉన్న పక్కలో..
పాప బోసినవ్వులకోసం,
పెట్టే కేరింతలకోసం,
అంతలోనే ఏడ్చేస్తూ చేసే అల్లరికోసం!
వెదుకుతున్నా..
అయినా..

హాలులో..
ఒంటరైపోయిన ఉయ్యాల హుక్కు,
హుక్కుకి వ్రేలాడే ఉయ్యలలో పాప కోసం...
తలంటుతోంటే పెట్టే గుక్కకోసం,
సాంబ్రాణి పోగకి మూసే మగత కళ్ళకోసం,
జోల పాటకి హాయిగా నిదురోయే చిట్టితల్లి కోసం!
వెదుకుతూనే వున్నా..
అయినా..

వంటింటి అల్మారా లో
బొసిపోయిన ఖాళీ పాల డబ్బాలు!
కాఫీ త్రాగాలనిపించటం లేదు

ఒక్క క్షణం కూడా నిలువనివ్వని
ఆకలి అరుపులకోసం..
ఇల్లు వాడ దద్దరిల్లే పాప ఏడ్పులకోసం..
కూతురి కడుపునింపటానికి
నాకుతురు తీసే పరుగుల కోసం!
వెదుకుతూనే వున్నా..
అయినా..

వరండాలో..
నడుంవాలుస్తూ పైకి చూశా..
వెలిసిపోయిన ముఖంతో,
బిక్కు బిక్కుమంటూ
నన్నే చూస్తోంది,బట్టలారేసుకొనే తాడు!

తాడంతా వ్రేలాడే చిట్టిఫొట్టి గౌనులకోసం..
వరసగా రెపరెపలాడే చిన్ని చిన్ని నేపీలకోసం..
ముచ్చటేసే ఆరేసిన పాప బట్టలకోసం!

అయినా..వెదుకుతూనే వున్నా..
బోసిపోయిన ఇంట్లో..
నిద్ర రాని..కలత నిద్రలో..
అమ్మతో కలసి..నాన్న దగ్గరకు తుర్రుమన్న,
నా చిట్టితల్లి కోసం...

....26.09.2013

No comments:

Post a Comment